Friday, 25 January 2013

[YSR ] జగన్‌పై కుట్రలను దగ్గరి నుంచి చూశా: నాని


మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ప్రజల, కార్యకర్తల ఆకాంక్షలు, వారి కోరిక మేరకే తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) వెల్లడించారు. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అభిమానినైన తాను ఆయన కుటుంబంపై జరుగుతున్న వేధింపులకు కలత చెందానని అన్నారు. గురువారం నాని చంచల్‌గూడ జైలులో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకుని పార్టీలో చేరడానికి తన సంసిద్ధతను తెలిపారు. జగన్‌తో ములాఖత్ అనంతరం జైలు వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. నెలల తరబడి జగన్‌ను జైల్లో పెట్టడం బాధాకరమని, తమపై జరుగుతున్న వేధింపులను చాటి చెప్పడానికి ఏనాడూ బయటకు రాని వైఎస్ సతీమణి, ఆయన కుమార్తె రోడ్లెక్కడం తనకు ఆవేదన కలిగించిందని నాని అన్నారు. కష్టాల్లో ఉన్న తరుణంలో ఇంకా జగన్ వైపు నిలబడక పోవడం ఏ మాత్రం ధర్మం కాదని నియోజకవర్గ ప్రజలు తనకు చెప్పారని దాని దరిమిలా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు.

వై.ఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబునాయుడు కలిసి మెలిసి చేసిన కుట్రలన్నీ చాలా దగ్గరిగా ప్రత్యక్షంగా మౌనంగా వీక్షించానని ఆయన అన్నారు. అసెంబ్లీలో కూడా వారి కుమ్మక్కు చూశానని వివరించారు. కేంద్రం, చంద్రబాబు కలిసి కుమ్మక్కై ఎనిమిది నెలలుగా జగన్‌ను జైల్లో ఉంచడం చూసి ఆయనకు మద్దతుగా నిలబడటానికి ఇదే సరైన సమయంగా తాను భావించానని పేర్ని అన్నారు. నియోజకవర్గ ప్రజలు తన ను నమ్మి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు 2014 వరకు కాంగ్రెస్‌పార్టీలో కొనసాగుదామనుకున్నానని, ప్రస్తుత పరిస్థితుల్లో మహానేత తనయుడైన జగన్‌కు అండగా ఉండి పనిచేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ఇచ్చిన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. త్వరలో తేదీ నిర్ణయించుకుని వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరతానని ఆయన అన్నారు. చంచల్ గూడ జైలులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆళ్ళగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు.