Monday, 28 January 2013

[YSR ] కుట్రల నడుమ ఒక యోధుడి ఒంటరి పోరాటం!

కాంగ్రెస్‌పార్టీ వేయిపడగల విషనాగు. పాము తన పిల్లలను తానే ఆరగించినట్టు కాంగ్రెస్‌పార్టీ వైఎస్సార్‌ని కబళించాలని చూసింది. ఆయన రెండోసారి కూడా ముఖ్యమంత్రి అవుతాడనే భయంతో 2009లో ఎన్నికల ముందు ఢిల్లీలో పథక రచన జరిగినట్లు అప్పట్లోనే పెద్దఎత్తున వార్తలొచ్చాయి. ఎన్నికల యుద్ధానికి సిద్ధమైన రాజశేఖరరెడ్డికి కేంద్రం సహాయనిరాకరణ చేసింది! 

అందుకే జాతీయ నాయకులెవరూ ఆంధ్రాలో ఎన్నికల ప్రచారానికి రాలేదు. అయినప్పటికీ వైఎస్సార్ ఒక్కరే యుద్ధం చేసి విజయం సాధించారు. ఆయన మరణానంతరం, తండ్రి కీర్తిని కాపాడుకోవటం కోసం తనయుడు జగన్ వైఎస్సార్ పార్టీని ప్రారంభించటంతో ఢిల్లీ పెద్దలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వైఎస్సార్‌ను, జగన్‌ను ఒకేసారి దెబ్బకొట్టాలనే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ తన శత్రువైన టీడీపీతో చేయి కలిపింది. ఉమ్మడి శత్రువైన జగన్‌ను నిలువరించాలంటే కాంగ్రెస్‌పార్టీలో అటువంటి సమర్థులు లేరు కాబట్టి చంద్రబాబుతో రహస్య ఎజెండా కుదుర్చుకుంది.

అక్కడ నుండి జగన్‌ను కట్టడి చేయటానికి వ్యూహరచన చేసింది. తన చేతులకు మట్టి అంటకుండా ఒక అమాయకపు దళితుడిని జగన్‌పై కేసులు వేయడానికి వాడుకుంది. ఇంతచేసినా సీబీఐ ఒక్క సాక్ష్యం కూడా సేకరించలేకపోయింది. ఒక్కరు కూడా జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదు. వైఎస్సార్ మిత్రులు కూడా అధికారం కాపాడుకోవడం కోసం నమ్మకద్రోహులుగా మారి, జగన్ అణచివేసే ఈ కుట్రలో పావులుగా ఉపయోగపడ్డారు. ఇలా ఇంతమంది మధ్య, ఇన్ని కుట్రల నడుమ ఒంటరి పోరాటం చేస్తున్నారు జగన్. 

కొలిమిలో కాలి సమ్మెట దెబ్బలు పడితేనే ఇనుము ఆయుధంగా మారుతుంది. అలాగే జగన్ కూడా. జగన్ అనే శక్తిని ఎదుర్కోవటానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసి, ఇంకా ప్రజల సమస్యలను తెలుసుకోవటానికి చంద్రబాబు పాదయాత్రలు చేస్తుండగా, నూటపాతికేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌పార్టీ చేష్టలుడిగి చూస్తోంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తగిన సమయంలో ఈ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారు. జగన్‌ని అక్కున చేర్చుకుంటారు. ఆరోజుకోసం మేము ఎదురు చూస్తుంటాం. 

- శశికుమార్ చందోలు, గుంటూరు


పోరుబాటలో నీ వెంట నడుస్తాం

నీ కోసం... 
ఎన్నో కళ్లు కాయలు కాస్తూ చూస్తున్నాయి.
నీ చిరునవ్వుల జల్లులలో తడవాలని...
నీ ఓదార్పులో సేద తీరాలని
నీ పోరుబాటలో నడవాలని ఆశిస్తున్నాయి.
సాహసంతో సాగి, సహనంతో ఆగి
ఆత్మవిశ్వాసంతో కదిలి
ఆప్యాయతతో మెదిలి
కుట్ర కుతంత్రాలను ఛేదించుకుంటూ
జైలు నుండి విడుదలై
రాబోయే ఎన్నికల రణరంగంలో
రాజన్న దీవెనతో ప్రజాబలంతో
విజయం సాధిస్తావని ఆకాంక్షిస్తున్నాయి.