Friday, 25 January 2013

[YSR ] బాబు అధికారంలో ఉన్నంత కాలం అవినీతే


 రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలో ఎక్కడా టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు అంత జిత్తులమారి నక్క, నయవంచకుడు మరొకరు ఉండరని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిని జిత్తులమారి కొంగ అని బాబు విమర్శించడాన్ని నల్లపరెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పాదయాత్రలో చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడుతుండటాన్ని చూసి రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని, అసలు అవినీతికి అడ్రసే చంద్రబాబు అనే విషయం ఎవరినడిగినా చెబుతారని ప్రసన్న విమర్శించారు. బాబు అధికారంలో ఉన్నంత కాలం అవినీతే రాజ్యమేలిందని, పదవి నుంచి దిగిపోగానే అవినీతి అని ఆయన గగ్గోలు పెడుతుంటే ప్రజలకు నవ్వాలో, ఏడ్వాలో తెలియడం లేదని ప్రసన్న ధ్వజమెత్తారు. ఇప్పటికైనా నీతిమాలిన రాజకీయాలు మానుకోవాలని బాబుకు సూచించారు. వై.ఎస్ గురించి మాట్లాడే నైతిక అర్హత బాబుకు లేదని ఆయన విమర్శించారు. వై.ఎస్ తన పాలనలో అన్ని వర్గాల వారికీ న్యాయం చేశారు, అందుకే ఆయన కుటుంబాన్ని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. వై.ఎస్‌ను విమర్శిస్తున్న చంద్రబాబు సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి గద్దె దించారన్నారు. ఎన్టీఆర్‌ను మానసికంగా హత్య చేసిన బాబు...నయవంచకుడు, నరరూప రాక్షసుడు అని ప్రసన్న విమర్శించారు. వై.ఎస్ పేదల గుండెల్లో గూడు కట్టుకున్న దైవమని ఆయన పేర్కొన్నారు.