రాష్ట్రంలోనే
కాదు, యావత్ భారతదేశంలో ఎక్కడా కూడా టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు
అంత జిత్తుల మారి నక్క, నయవంచకుడు మరొకరు లేరని వైఎస్సార్ కాంగ్రెస్
ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన గురువారం
విడుదల చేసిన ఒక ప్రకటనలో దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిని జిత్తులమారి కొంగ
అని బాబు విమర్శించడంపై తీవ్రంగా ఆక్షేపించారు. పాదయాత్రలో చంద్రబాబు
అవినీతి గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ ముక్కున
వేలేసుకుంటున్నారని అసలు అవినీతికి అడ్రసే చంద్రబాబు అనే విషయం ఎవరినడిగినా
చెబుతారని ప్రసన్న విమర్శించారు. బాబు అధికారంలో ఉన్నంత కాలం అవినీతే
రాజ్యమేలిందని, పదవి నుంచి దిగిపోగానే అవినీతి అని ఆయన గగ్గోలు పెడితే
ప్రజలకు నవ్వాలో, ఏడ్వాలో తెలియడం లేదని ప్రసన్న ధ్వజమెత్తారు. అవినీతి
గురించి బాబు మాట్లాడుతూ ఉంటే ప్రజలు నమ్మడం లేదని పైగా
అసహ్యించుకుంటునానరని ఆయన అన్నారు. ఇప్పటికైనా నీతిమాలిన రాజకీయాలు
మానుకోవాలని, వై.ఎస్ గురించి మాట్లాడూ నైతిక అర్హత బాబుకు లేదని ఆయన
విమర్శించారు. వై.ఎస్ తన పాలనలో అన్ని వర్గాల వారికి న్యాయం చేశారు, అందుకే
ఆయన కుటుంబాన్ని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. వై.ఎస్‌ను విమర్శిస్తున్న
చంద్రబాబు సొంత మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి గద్దె దించి మానసికంగా
హత్య చేసిన బాబు నయవంచకుడు, నరరూప రాక్షసుడు అని ఎమ్మెల్యే విమర్శించారు.
వై.ఎస్ పేదల గుండెల్లో గూడు కట్టుకున్న దైవమని ఆయన పేర్కొన్నారు.