Wednesday, 23 January 2013

[YSR ] ఎవరితోనూ పొత్తు పెట్టుకోం: మైసూరా


వయలార్ వ్యాఖ్యలపై మైసూరా తీవ్ర స్పందన
అలా చెప్పడానికి వారికి సిగ్గుండాలని వ్యాఖ్య
సొంతంగా పోటీ చేసే సత్తా తమకుందని స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి స్పష్టం చేశారు. స్వతంత్రంగా పోటీ చేసే సత్తా తమ పార్టీకి ఉందన్నారు. ‘‘ఎన్నికలొస్తే రాష్ట్ర ప్రజలు జగన్‌నే గెలిపిస్తారు. అలాంటప్పుడు ఒకరితో పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరమేమిటి?’’ అని ప్రశ్నించారు. శనివారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీతో పొత్తు విషయమై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు వయలార్ రవి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘ఆయనది వన్ సైడ్ లవ్ (ఏకపక్ష ప్రేమ). ఓవైపు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా జైల్లో పెట్టి, సీబీఐ ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ... ఇంకా ఆ మాటలనడానికి సిగ్గూ ఎగ్గూ ఉండాలి’’ అంటూ ధ్వజమెత్తారు. జగన్ కాంగ్రెస్‌లో ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ గతంలో చేసిన వ్యాఖ్యలను మైసూరా ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్టీని వీడారు గనుకే జగన్ జైల్లో ఉన్నారనే విధంగా ఆజాద్ మాట్లాడారన్నారు.

నిజానికి కుమ్మక్కులు, కుతంత్రాలు జరుగుతున్నది కాంగ్రెస్, టీడీపీల మధ్యేనన్నారు. ఆ రెండు పార్టీలు తెరవెనక ఒకలా, తెరముందు మరోలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ కుమ్మక్కుల్లో లోగుట్టు తేలాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. ‘‘వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దేశం మొత్తమ్మీద మూడంకెల సీట్లు కూడా వస్తాయో లేదో అనుమానమే. అలాంటి పార్టీతో పొత్తుల గురించి మాట్లాడటమేమిటి? 2014 లోక్‌సభ ఎన్నికల తరువాత వచ్చే ఫలితాలు, అప్పటి పరిస్థితులను బట్టి వైఎస్సార్‌సీపీ ఏ వైఖరి తీసుకోవాలనేది అప్పుడే నిర్ణయిస్తుంది. మతతత్వ పార్టీలతో జత కట్టబోమని, లౌకికవాద పార్టీలతోనే కలుస్తామని మా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు. ఆ ప్రాతిపదిక మీదే మద్దతులుంటాయి. ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, జేడీ(యూ)... వంటివన్నీ లౌకికవాద పార్టీలే’’ అని మైసూరా వివరించారు. బెయిల్ రాకుండా సీబీఐ ద్వారా అడ్డుకుంటున్నా తాము న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామేతప్ప ఇంకెలాంటివీ తమకు అవసరమే లేదన్నారు.