Wednesday, 9 January 2013

[YSR ] ముమ్మరంగా సాగుతున్న ‘జగన్ కోసం.. జనం సంతకం’


స్వయంగా అందజేయనున్న విజయమ్మ
ముమ్మరంగా సాగుతున్న ‘జగన్ కోసం.. జనం సంతకం’

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కూట్రపూరిత కేసులు, అక్రమ నిర్బంధానికి నిరసనగా ‘జగన్ కోసం- జనం సంతకం’ పేరుతో ఆ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అన్ని జిల్లాల్లో ముమ్మరంగా సాగుతోంది. సంతకాల కోసం పార్టీ నాయకులు జనం దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వారే స్వయంగా తరలివచ్చి సంతకాలు చేస్తున్నారు. కంప్యూటర్లు, ఇంటర్నెట్‌పై అవగాహన ఉన్నవారు.. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్.కామ్, సాక్షి.కామ్, సాక్షిటీవీ.కామ్’’ వెబ్‌సైట్లలోకివెళ్లి సంతకాలు చేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇంకొందరు ఆ పార్టీ సైట్‌లో పత్రాలు డౌన్‌లోడ్ చేసుకుని.. జగన్‌కు మద్దతు తెలిపేవారితో సంతకాలు చేయించి హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి పంపుతున్నారని వివరించాయి.

మరికొందరు ‘సాక్షి’ పత్రికలో పార్టీ ఇచ్చిన ప్రకటనను జిరాక్స్ చేయించి వాటిపై సంతకాలు చేసి పంపుతున్నారని పేర్కొన్నాయి. కోటి సంతకాల సేకరణ పూర్తికాగానే వాటిని పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ స్వయంగా రాష్ట్రపతిని కలిసి అందజేయాలని నిర్ణయించారు. కోటి సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా విజయమ్మ నాయకత్వంలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. జగన్ విషయంలో సీబీఐ మొదటి నుంచీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, అందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సాగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వివరిస్తూ రూపొందించిన వినతిపత్రంతో పాటు కోటి సంతకాలను స్వయంగా విజయమ్మ రాష్ట్రపతికి అందజేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరాలని నిర్ణయించారు.