Monday, 26 November 2012

[YSR ] ఐజలో ముగిసిన షర్మిల యాత్ర


షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’పాదయాత్ర 39వ రోజు మహబూబ్‌నగర్‌ జిల్లా ఐజలో ముగిసింది. ఐజ మండలం డింగిదొడ్డి వద్ద షర్మిల బస చేయనున్నారు. పాదయాత్రలో షర్మిల ఇప్పటిదాకా 523.5 కిలోమీటర్లు నడిచారు.

ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్‌ ఇచ్చిన ఘనత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డిదేనని షర్మిల అన్నారు. మహబూబ్‌నగర్‌ వాసులు త్యాగమూర్తులని తన తండ్రి చెబుతుండేవారని, ఈ జిల్లాను పచ్చని పసిడి జిల్లాగా మార్చాలని తపించేవారని వెల్లడించారు. రూ.7వేల కోట్లతో జిల్లాలో 8లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా వైఎస్ కృషిచేశారని, అందులోభాగంగానే జిల్లాలో 4 ప్రాజెక్టులను నిర్మించారని చెప్పారు. 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా ఐజలో ఆదివారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో షర్మిల మాట్లాడారు. 

వైఎస్‌ మరణాంతరం 25శాతం పనులు మిగిలిపోయాయని, మూడేళ్లయినా ఆ పనులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. తెలంగాణ పేరుతో రాజకీయం చేస్తున్నవారికి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మహానేత పథకాలను అమలు చేస్తానని చంద్రబాబు హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. అన్నివిధాలుగా విఫలమైన కిరణ్ సర్కారును కాపాడుతున్నది చంద్రబాబేనని అన్నారు. కుట్రలు పన్ని జగనన్నను జైలుకు పంపారన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని జగనన్నకు బెయిల్‌ రాకుండా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయించే సూర్యుణ్ని ఎవరూ ఆపలేరని అన్నారు.