Thursday, 22 November 2012

[YSR ] కౌంటర్ దాఖలుకు గడువు కోరిన సీబీఐ

తనను అరెస్టు చేసి 90 రోజులు దాటిన నేపథ్యంలో చట్టబద్ధంగా ఇవ్వాల్సిన స్టాట్యుటరీ బెయిల్‌ను మంజూరు చేయాలంటూ కడప ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 23కు వాయిదా పడింది. ఈ పిటిషన్‌ను ఈ నెల 16న విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి స్పష్టం చేస్తూ, విచారణను బుధవారానికి వాయిదా వేయడం విదితమే. 

ఈ నేపథ్యంలో ఈ కేసు బుధవారం విచారణకు రాగా.. కౌంటర్ దాఖలుకు మరో రెండు రోజులు గడువు ఇవ్వాలని సీబీఐ న్యాయవాది కోరారు. ఇందుకు జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. 23న కౌంటర్ దాఖలు చేయడంతోపాటు వాదనలూ వినాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. తనను అరెస్టు చేసి ఇప్పటికే ఐదున్నర నెలలు దాటిపోయిందని, ఏ కేసులోనైనా ఒకరిని అరెస్టు చేశాక 90 రోజుల్లోగా సీబీఐ ఆ విషయమై చార్జిషీటు దాఖలు చేయకపోతే తప్పనిసరిగా సదరు నిందితుడికి బెయిలు ఇవ్వాల్సిన అవసరముందని పేర్కొంటూ సీఆర్‌పీసీలోని సెక్షన్ 167(2) కింద జగన్‌మోహన్‌రెడ్డి స్టాట్యుటరీ బెయిలు పిటిషన్‌ను ఈ నెల 16న దాఖలు చేశారు. 

అలాగే ఈ కేసులో తనను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపింది తొలి చార్జిషీటుకు సంబంధించిన(సీసీ-8) కేసులోనని, దానిపై ఇప్పటికే దర్యాప్తు పూర్తయినందున తనకు బెయిలు మంజూరు చేయాలంటూ సీఆర్‌పీసీ సెక్షన్ 437 కింద.. సాధారణ బెయిలు పిటిషన్‌ను కూడా ఆయన దాఖలు చేయడం తెలిసిందే.