Thursday, 22 November 2012

[YSR ] మా సహనాన్ని పరీక్షిస్తున్నారు!



హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించి బెయిల్ పిటిషన్ న్యాయస్థానాల ముందుకొచ్చినప్పుడల్లా కౌంటర్ దాఖలు చేయడంలో సీబీఐ కావాలనే జాప్యం చేస్తోందని ఆ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు ఆరోపించారు. 

జగన్‌పై సీబీఐ కక్ష సాధింపుతో వ్యవహరిస్తూ తమ సహనాన్ని పరీక్షిస్తోందని, సీబీఐ వైఖరి ఇలాగే కొనసాగితే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందన్నారు. సీబీఐ విచారణల తీరూ తెన్నూ ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినపుడు తీవ్రంగా స్పందించడం ఖాయమన్నారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఈ నెల 16న తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ జగన్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. 

21వ తేదీన ఇందుకు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే సీబీఐ మరింత గడువు కావాలని కోరింది. దీంతో జడ్జి ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు. సీబీఐ కావాలనే ఇలా చేస్తోంది. జగన్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు, హైకోర్టు, కింది కోర్టుల్లో ఎక్కడ దరఖాస్తు చేసుకున్నా కౌంటర్ వేయడానికి వ్యవధి కోరడం, ఐదు, పది రోజులు లేదా నెల రోజుల గడువు కావాలని అడగడం సీబీఐకి ఆనవాయితీగా మారింది. సాధ్యమైనంత జాప్యం చేసి తీరా పిటిషన్ విచారణకు వచ్చినపుడు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని సీబీఐ ప్రతిఘటిస్తోంది’ అని అంబటి అన్నారు.