జగన్ ఆస్తుల కేసును, ఎమ్మార్ కేసును సీబీఐ ఒకే సమయంలో విచారిస్తోంది. కానీ, చంద్రబాబుపై ఇప్పటివరకూ ఎలాంటి దర్యాప్తు చేయకపోవడం, ఆయన హయాంలో జరిగిన అక్రమాలపై ఇప్పటివరకు దృష్టి పెట్టకపోవడం వంటి పరిణామాలు సీబీఐపై ఉన్న అనుమానాలను రెట్టింపు చేస్తున్నాయి. ఇక ఐఎంజీ కేసులో చంద్రబాబును ఇప్పటివరకూ ప్రశ్నించడానికి కూడా ప్రయత్నించలేక పోవడం కూడా ఇందుకు తోడవుతోంది. అంతేకాక అశేష ప్రజాభిమానంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు ముప్పుగా మారిన జగన్ ను రాజకీయంగా అణిచివేయడానికే సీబీఐ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సాధారణ ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమౌతోంది. సుప్రీం కోర్టులో శుక్రవారం బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుందనుకున్న సమయంలో న్యాయవ్యవస్థను ప్రభావితం చేయడానికి 'నోటీసుల' రూపంలో ఈడీ ప్రయత్నం చేస్తోందన్నది స్పష్టమవుతోంది. మరోవైపు క్విడ్ ప్రో కో కేసులో రూ.51 కోట్లు విలువ చేసే ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ప్రకటన చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ కు బెయిల్ వస్తుందనుకున్న తరుణంలో ఈడీ ప్రకటన తమను ఆశ్చర్యానికి గురిచేసిందని, ఇది కుట్రలో భాగమే అని అన్నారు. గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో వైఎస్ జగన్ సోదరి షర్మిళ, జగన్ భార్య భారతి, ఇతర కుటుంబీకులతో కలిసి విజయమ్మ మీడియాతో మాట్లాడారు. జగన్ క్షేమంకోసం, విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్ అభిమానులంతా ప్రార్థనలు చేస్తున్నారని విజయమ్మ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్తులను అటాచ్ చేస్తున్నామంటూ ఈడీ ప్రకటన ఇవ్వడం తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు కావడమేనన్నారు. టీడీపీ ఎంపీలు ఢిల్లీలో చిదంబరంను కలిసి ఆస్తులను అటాచ్ చేయమని అడిగిన వెంటనే ఈడీ ప్రకటన రావడం వెనుక కుట్ర దాగుందన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో తెలెత్తుతున్నాయన్నారు. బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడల్లా సీబీఐ అనుబంద చార్జిషీట్ లు వేస్తోందని, గత 14 నెలలుగా విచారణ జరుపుతున్న సీబీఐ జగన్ కు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా చూపలేకపోయిందన్నారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే జగన్ ను అన్యాయంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సీబీఐ న్యాయవాదిని తామే మార్చామనే విధంగా అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వివాదాస్పద 26 జీవోలకు సంబంధించిన విచారణ ఏమైందో ఇప్పటికి తెలియలేదన్నారు. సీబీఐ, ఈడీ బెదిరింపులకు తాము భయపడడటం లేదని, వాస్తవాలను ప్రజలకు తెలపాలన్న ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చామని విజయమ్మ అన్నారు. |