Monday, 14 May 2012

గొంతెండుతున్న గ్రామాలు


రూ.74 కోట్లు అడిగితే.. రూ.9 కోట్లు విదిల్చిన ప్రభుత్వం

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా పల్లెల గొంతెండిపోయింది. మంచినీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మారుమూల గ్రామాల మహిళలు నీటి కోసం మైళ్లకొద్దీ నడిచివెళుతున్నారు. గిరిజన గ్రామాల్లో బిందె నీరు దొరకడం గగనమైపోతోంది. ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాల్సిన సర్కారు మొద్దునిద్ర పోతోంది. మంచినీటి సమస్యపై సమీక్షించే నాథుడే లేడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేసవిలో మండే ఎండలు దృష్టిలో ఉంచుకుని అధికారులు నిధుల కోసం ముందే మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. మొత్తంగా రూ.9 కోట్లు మాత్రం విదిల్చి చేతులు దులుపుకుంది. 

ప్రకృతి వైపరీత్యాల కింద కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరిస్తే తప్ప.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. గ్రామాలలో మంచినీటి సమస్య పరిష్కారానికి రూ.74 కోట్లు కావాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. మూడు నెలల క్రితమే ఈ మేరకు నివేదిక సమర్పించారు. వ్యవసాయ బోర్లు అద్దెకు తీసుకోవడం, ఉన్న బోర్లను మరింత లోతుగా వేయడం లేదా ఫ్లషింగ్ చేయడం, కొత్త బోర్లు వేయడం, పంపులు సరిగా పనిచేయనిచోట కొత్త వాటిని వేయడం తదితర ప్రత్యామ్నాయ చర్యల నిమిత్తం అధికారులు మిగతా 2వ పేజీలో ఠ

ఈ మొత్తాన్ని విడుదల చేయాల్సిందిగా కోరారు. రాష్ట్రంలో ఎనిమిదిన్నర కోట్ల జనాభా ఉంటే అందులో దాదాపు ఆరుకోట్ల మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. వీరిలో మూడున్నర కోట్ల మందికి ప్రతిరోజు 40 లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంటే.. 25 లీటర్లు కూడా సరఫరా చేయడం లేదని, అదికూడా రోజూ సరఫరా చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

భూగర్భ జలాలు బాగా అడుగంటిపోవడంతో సమస్య తీవ్రంగా మారింది. పలు జిల్లాల్లో రెండు నుంచి నాలుగు మీటర్ల వరకు భూగర్భ జలాలు పడిపోయాయి. రాష్ట్రంలో 3.35 లక్షల చేతి పంపులు ఉండగా వివిధ కారణాలతో 30 వేలకు పైగా పంపులు పనిచేయడం లేదు. భూగర్భ జలాలు పడిపోవడం వల్ల మరో పది శాతం బోర్లు పనిచేయడం లేదని అధికారవర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1451 మేజర్ పంచాయతీల్లో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు ఉన్నాయి. వీటిల్లో నీరు నిల్వ చేసుకోవడానికి కాల్వల ద్వారా నీటిని విడుదల చేయాలని కోరినా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. 

చిత్తూరు, అనంతపురం, ప్రకాశం, పశ్చిమగోదావరి, మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు గ్రామ పంచాయతీల్లోనూ నీటి సమస్య తీవ్రంగా ఉంది. సీఎం సొంత జిల్లా చిత్తూరులోని 500 గ్రామాలకు పైగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఫ్లోరైడ్ పీడిత జిల్లా నల్లగొండలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండువేల గ్రామాల్లో ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. సకాలంలో వర్షాలు పడకుంటే పరిస్థితి మరింత విషమిస్తుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ పథకాలకూ నిధుల్లేవు

గ్రామాల్లో మంచినీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం గతంలో సింగిల్ విలేజ్ స్కీమ్, మల్టీ విలేజ్ స్కీమ్‌లు ప్రారంభించింది. 2500 పథకాల కింద ఐదు వేల గ్రామాల్లో నీటి సరఫరా వీటి ప్రధానోద్దేశం. కొన్ని చోట్ల గ్రామం యూనిట్‌గా, మరికొన్ని చోట్ల కొన్ని గ్రామాలను కలిపి పథకాలు రూపొందించారు. అయితే ఇవి నేటికీ పూర్తి కాలేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నత్తనడక నడుస్తున్నాయి. అన్ని పథకాల్లో మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయకపోవడంతో అనేకచోట్ల కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. గత మూడేళ్లుగా ఈ పథకాలకు రూ.800 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. వేసవి ముందైనా నిధులు విడుదల చేసి ఉంటే కొన్ని గ్రామాలైనా నీటి ఎద్దడి నుంచి బయటపడి ఉండేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.