Tuesday, 15 May 2012

‘సాక్షి’కి మద్దతుగా విభిన్న రీతుల్లో ప్రదర్శనలు


న్యూస్‌లైన్ నెట్‌వర్క్: పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడికి ప్రజల నుంచి నిరసన వెల్లువెత్తుతోంది. ‘సాక్షి’కి ప్రజామద్దతు పెల్లుబుకుతోంది. ‘కోటి సంతకాల’ సేకరణ కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతుండగా, సీబీఐ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మంగళవారం కూడా పలు జిల్లాల్లో వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, చిత్తూరు, అనంతపురం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, విజయనగరం, వైఎస్‌ఆర్ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. 

పజా, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు ఇలా భిన్న రంగాల వారు వీటిలో పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్‌పేటలో ‘సాక్షి’కి సంఘీభావంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రికి స్థానికులు ఉత్తరాలు రాసి పంపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు, పలుచోట్ల జర్నలిస్టులు నిర్వహించిన మౌన ప్రదర్శనకు పలు పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. భిక్కనూర్‌లో ‘సాక్షి’కి మద్దతుగా వ్యాపార, వాణిజ్య సంస్థల గుమాస్తాలు ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. పాలకులకు కనువిప్పు కలిగించాలంటూ వినతిపత్రాలు అందజేశారు. 
  

వరంగల్ జిల్లా నర్సంపేటలో న్యాయవాదులు ‘సాక్షి’కి మద్దతు పలికారు. విజయనగరం జిల్లాలో నిర్వహించిన సంతకాల సేకరణకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరులోనూ సంతకాల సేకరణ జరిగింది. నెల్లూరులో కలానికి కళాకారులు మద్దతుగా నిలిచారు. సాక్షిపై కాంగ్రెస్, టీడీపీ పెద్దల తీరును ఆటపాటలతో వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, భీమవరం, కొవ్వూరుల్లో పాత్రికేయులు, ప్రజాసంఘాల నేతలు రిలే దీక్షల్ని ప్రారంభించారు. వీరికి న్యాయవాదులు, ప్రభుత్వోద్యోగులు, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నేతలు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. తిరుపతిలో జర్నలిస్టులు వినూత్నంగా నిరసన తెలిపారు. నుదుట నామాలు దిద్దుకుని అలిపిరి పాదాల మంటపం మెట్లపై కూర్చుని గోవిందనామస్మరణ చేశారు. సీబీఐకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సద్బుద్ధిని ప్రసాదించాలని తిరుమలేశుని వేడుకున్నారు. తమ వినతిపత్రాన్ని పాదాల మంటపం వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీలో సమర్పించారు. 

అనంతపురంలో ‘ప్రజా బ్యాలెట్’

‘సాక్షి’పై ప్రభుత్వం, సీబీఐ తీరు ‘న్యాయమా - అన్యాయమా?’ అనే అంశంపై జనచైతన్య వేదిక అనంతపురంలో ప్రజా బ్యాలెట్ నిర్వహించింది. ఈ బ్యాలెట్‌లో మొత్తం 5,426 ఓట్లు పోలవగా అందులో సీబీఐ తీరు అన్యాయమని 5,233 మంది, న్యాయమేనని 131 మంది, తటస్థంగా 62 మంది తమ అభిప్రాయాలను తెలిపారు. చాలా మంది ఓటుతో పాటు ప్రభుత్వ పనితీరును ఖండిస్తూ తమ అభిప్రాయాలను జోడించారు. పెద్ద సంఖ్యలో కవులు, కళాకారులు, మేధావులు, వ్యాపార వేత్తలు, మహిళలు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

‘సాక్షి’కి మద్దతుగా కువైట్‌లోనూ నిరసన

పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడికి కువైట్‌లోని తెలుగువారు సైతం స్పందించారు. వైఎస్‌ఆర్ యువసేన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఎన్‌ఆర్‌ఐల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కువైట్ నగరంలో ‘సాక్షి’ దినపత్రిక, చానల్‌కు మద్దతుగా వారు నిరసనలు తెలిపారు. ఈ విషయాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ దేవ వినోద్ కుమార్ ‘న్యూస్‌లైన్’కు అందజేశారు. 

వైఎస్ విజయమ్మ సంఘీభావం 

‘కోటి సంతకాల’ సేకరణ కార్యక్రమానికి వైఎస్‌ఆర్ జిల్లావ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ సంతకం చేసి ‘సాక్షి’కి మద్దతును ప్రకటించారు. ఆమెతోపాటు పలువురు ప్రముఖులు కూడా సంతకాలు చేసి సంఘీభావం తెలిపారు. కడప, బద్వేలు, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో సంతకాల సేకరణ జరిగింది. పులివెందులలో మహాత్మాగాంధీ విగ్రహానికి వికలాంగులు వినతిపత్రం సమర్పించారు. పాలకుల కళ్లు తెరిపించి పత్రికా స్వేచ్ఛను ప్రసాదించాలని కోరారు.