
నెల్లూరు జిల్లా గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, ఆత్మకూరు, కావలి తదితర ప్రాంతాల్లో సంతకాల సేకరణ జరిగింది. నెల్లూరులో జర్నలిస్టులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. మెదక్ జిల్లా నారాయణ ఖేడ్, గజ్వేల్, రామాయంపేట, అందోలు ప్రాంతాల్లో సాక్షికిపెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. గజ్వేల్‌లో తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్, టీడీఎస్ ఫోరం, డీబీఎఫ్, న్యాయవాదుల సంఘం నేతలు పాల్గొన్నారు.

విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం నేతలతో సహా 26 మందిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం, ఏలూరుల్లో పాత్రికేయులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టగా, కర్నూలులో బైక్ ర్యాలీ నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో వైఎస్‌ఆర్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి పిండప్రదానం నిర్వహించారు. సాక్షిపై సీబీఐ ద్వారా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పత్రికా స్వేచ్ఛను హరించడమేనని సీపీఐ ఫ్లోర్ లీడర్ గుండా మల్లేష్ విశాఖలో అన్నారు. ప్రభుత్వం అలాంటి చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
నల్లగొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు, మండలాల పరిధిలో సంతకాల సేకరణ జరిగింది. టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం, అనుబంధ సంఘాలు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు సంతకాల సేకరణలో పాల్గొన్నాయి. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌కు గ్రీవెన్స్ డేలో తమ సమస్యలు విన్నవించేందుకు వచ్చిన సామాన్య ప్రజానీకం సైతం సంతకాలు చేసి, సాక్షికి సంఘీభావం తెలిపారు. డ్వాక్రా సంఘాల మహిళలు అధికంగా సంతకాలు చేశారు. ఇదిలా ఉండగా, సంతకాల సేకరణతోపాటు నెటిజన్ల నుంచి కూడా సాక్షికి మద్దతు వస్తోంది. సాక్షికి మద్దతు తెలపాలంటూ ‘రాజమండ్రి.కో.ఇన్’ అనే వెబ్‌పోర్టల్ కూడా ప్రచారం చేస్తోంది. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌తో పాటు పలు ప్రాంతాల్లో పాత్రికేయులు మానవహారాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వ చర్యలపై తమ నిరసనను వ్యక్తం చేశారు.
‘సాక్షి’పై సీబీఐ కక్ష సాధింపు సరికాదు: స్వామిగౌడ్
హైదరాబాద్: నిష్పక్షపాతంగా వార్తలు రాసే సాక్షి దినపత్రికపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని టీఎన్జీవో అధ్యక్షుడు స్వామిగౌడ్ అన్నారు. రాజేంద్రనగర్‌లో సోమవారం జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని సాక్షికి మద్దతుగా సంతకం చేశారు. ఈ సందర్భంగా ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. ‘సాక్షి’ అకౌంట్లను స్తంభింపజేయడం సరైన చర్య కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని వేసి నిజానిజాలు తెలుసుకుని ఉండాల్సిందన్నారు. ప్రభుత్వ ప్రకటనలను నిలిపివేయడం వల్ల అవసరమైన సమాచారం లభించక అటు రాష్ట్ర ప్రజలకు, ఇటు పత్రికకు ఎంతో ఇబ్బంది కలుగుతుంద ని చెప్పారు. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. చరిత్రలో కలాన్ని నిర్బంధించిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదనే విషయాన్ని పాలకులు తెలుసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ‘సాక్షి’కి మద్దతుగా ఉద్యమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు.