Tuesday, 15 May 2012

విద్యార్థుల నెత్తినే ‘ఫీజు’ భారం! రీయింబర్స్‌మెంట్ పథకంలో కీలక మార్పు

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఫీజులో కొంత మొత్తాన్ని విద్యార్థులతోనే కట్టించేందుకు సర్కారు యోచన
ఫీజులు ఏమాత్రం పెరిగినా భరించలేమంటున్న ప్రభుత్వం
విద్యార్థులపై భారం మోపేలా సంక్షేమ శాఖ కొత్త ప్రతిపాదన
సానుకూలంగా స్పందించనున్న ప్రభుత్వం!
నిర్ణయం తీసుకుంటే 5 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. ఇప్పటివరకు ఈ పథకం కింద అర్హులైన విద్యార్థుల ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుండగా... ఇకపై ఫీజులో కొంతభాగం విద్యార్థులతో కట్టించాలనే ప్రతిపాదన తెరపైకి వస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వృత్తి విద్యా కోర్సులకు నిర్ధారించే ఫీజులో కొంత మాత్రమే ప్రభుత్వం భరిస్తుందని, మిగిలిన మొత్తాన్ని విద్యార్థులే కాలేజీలకు చెల్లించుకోవాలనే నిబంధన విధించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఫీజుల పెంపునకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు కాపీలు ఇంకా ప్రభుత్వానికి అందలేదు. ఇవి అందగానే ఫీజుల పథకంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీలో సంక్షేమశాఖ ఉన్నతాధికారులు.. ఫీజులో కొంతభాగం విద్యార్థులతోనే కట్టించాలన్న ప్రతిపాదన చేయబోతున్నారు. ప్రభుత్వం కూడా దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోనుంది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే 5 లక్షల పైచిలుకు విద్యార్థులపై ప్రభావం పడనుంది.

పెరిగిన భారం మోయలేమంటున్న ప్రభుత్వం..

వృత్తి విద్యా కోర్సుల ఫీజులు పెంచుకునే ందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో ఆయా కోర్సుల ఫీజులు భారీగా పెరిగే అవకాశం ఉంది. పథకం బడ్జెట్ కూడా అదే స్థాయిలో పెరుగుతుందని భావిస్తున్న ప్రభుత్వం.. పెరగబోయే ఫీజులను భరించేందుకు విముఖంగా ఉంది. కోర్టు చెప్పిన విధంగా ఫీజులు పెరిగితే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం బడ్జెట్ రూ.5 వేల కోట్లకు మించిపోతుందని, అంత మొత్తాన్ని మోయలేమని భావిస్తున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఈ మేరకు ఏం చర్యలు చేపట్టాలన్న అంశంపై సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పెరిగిన ఫీజుల మొత్తంలో కొంత విద్యార్థులతోనే కట్టించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం తెరపైకి తెస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఒక్క ఇంజనీరింగ్ కోర్సుల బడ్జెటే దాదాపు 60 శాతం పెరుగుతుందని ప్రభుత్వం లెక్కలు కట్టింది. 

ప్రస్తుతం ఇంజినీరింగ్ కోర్సులకు కన్వీనర్ కోటాలో రూ.31 వేలు, మేనేజ్‌మెంట్ కోటాలో రూ.91 వేల ఫీజు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ కోర్సు కనీస ఫీజు రూ.51 వేలుగా ఉంటుందని, కోర్టు చెప్పిన దాని ప్రకారం దీనిపై ఎంతో కొంత పెంచాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే ప్రస్తుతం రూ.1200 కోట్లుగా ఇంజినీరింగ్ కోర్సుల బడ్జెట్ రూ.2000 కోట్లు చేరుతుందని అధికారులు చెబుతున్నారు. మొత్తం వృత్తివిద్యా కోర్సులకు ప్రస్తుతం రూ.2 వేల కోట్ల బడ్జెట్ అవసరం అవుతుండగా.. అది రూ.3,200 కోట్లకు పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఈ విధంగా ఫీజులు పెరిగితే ఫీజుల పథకం మొత్తం బడ్జెట్ రూ.5 వేల కోట్లు దాటుతోందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 

ఈ నేపథ్యంలో వృత్తి విద్యాకోర్సుల ఫీజుల విషయంలో విద్యార్థులపై కూడా భారం మోపాలని యోచిస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా వీలున్నంత ఎక్కువ మంది విద్యార్థులను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని, అందులో భాగంగా మార్కుల ఆధారంగా (మొదటి సంవత్సరంలో విద్యార్థి సాధించే మార్కులను బట్టి రెండో సంవత్సరంలో ఫీజు చెల్లింపు) అర్హులను నిర్ధారించే అంశాన్ని కూడా తీవ్రంగా పరిశీలిస్తున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వం ఎంత చెల్లిస్తుంది..?

వృత్తివిద్యా కోర్సులకు ఫీజుల చెల్లింపులో విద్యార్థులను కూడా భాగస్వామ్యులను చేయాలని యోచిస్తోన్న ప్రభుత్వం అసలు ఎంత ఫీజు చెల్లించేందుకు సిద్ధపడుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇస్తున్న ఫీజుకే పరిమితమవుతుందా? పెరిగిన ఫీజులో కూడా కొంత భరిస్తుందా అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. అదీగాకుండా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఒక్కో కాలేజీలో ఒక్కో ఫీజు ఉండబోతోంది. ఈ లెక్కన ఫీజుల పథకం కింద.. ఒకే కోర్సుకు వేర్వేరు కాలేజీ విద్యార్థులకు వేర్వేరు ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని, ఇది సాధ్యం కాదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అందుకే ఫిక్స్‌డ్‌గా కొంత మొత్తం ఫీజు వరకే పరిమితమై, మిగతా ఫీజును విద్యార్థులే చెల్లించుకునే దిశగా ప్రభుత్వం యోచిస్తోందని పేర్కొంటున్నారు. 

{పభుత్వ ఆలోచన ప్రకారం ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ లాంటి వృత్తివిద్యా కోర్సులకు ప్రస్తుతం చెల్లిస్తోన్న ఫీజునే కొనసాగించనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఖజానా పరిస్థితి చూస్తే ప్రస్తుతమున్న ఫీజు కంటే కొద్దిగా పెరిగినా.. దాన్ని విద్యార్థే భరించాల్సి ఉంటుందని సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘ఒక్క ఫీజుల పథకానికే పెద్ద మొత్తంలో నిధులు చెల్లిస్తే ఎలా..? మిగిలిన పథకాలను కూడా అమలు చేయాలి కదా...’’ అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పథకం అమలులో ఉన్న లోపాలను గుర్తించడంతో పాటు సక్రమంగా అమలు చేసేందుకుగాను సమన్వయ కమిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధులతోపాటు కాలేజీ యాజమాన్యాలను కూడా తీసుకోవాలని యోచిస్తోంది.