Tuesday, 15 May 2012

‘సాక్షి’గా నిల్చిన ఆనవాళ్లేగానీ...!

సేవ చేసిన ఆనవాళ్ళే గానీ
‘సాక్షి’గా నిల్చిన ఆనవాయితేగానీ 
దేశ సార్వభౌమత్వాన్ని
ధిక్కరించిన దాఖలాలు కనబడితే
అరెస్టు చేద్దురుగాని రండి...

తెలుగువాళ్ళ ఆత్మ గౌరవ స్వరాన్ని
తాకట్టు పెట్టనన్న తర్వాతేగదా!
హస్తిన బానిసత్వానికి
హస్తగతం కానన్న తర్వాతేకదా!
స్వేచ్ఛా సామ్రాజ్యాల కూల్చివేతల అర్బన్ లెజెండ్లూ...
సెన్సార్షిప్ గడ్డ మీద ప్రజా పత్రికకు కాపిటల్
పనిష్మెంట్లూ...

ఉండవల్లి సాక్ష్యాలు
ఉండ చుట్టుకుపోయినట్లు
అవినీతి ఆకాశం మీద
అనంత అవినీతి చంద్రుడు కనిపించనప్పుడు
కరపత్రం రాసుకునే వాళ్ళకీ
కులపార్టీల పబ్బం గడుపుకునేవాళ్ళకీ
టాయిలెట్ పేపర్లు నడుపుకునే వాళ్ళకీ
ఇవి కనబడని రాజుగారి దేవతా వస్త్రాలు...

స్వేచ్ఛను అడ్డుకునేందుకు
ఎంచుకున్న ఫ్రాంకెన్‌స్టైన్ భూతాలు...
గుప్పెడు ఓట్ల కొట్లాటలో
మత ప్రసక్తిలేని లౌకిక రాజ్యంలో
ఆత్మల పోరాటంలో కొందరి నల్లమందే ఆత్మై
రెడ్డనీ - క్రిస్టియన్ రెడ్డనీ - రెడ్డి క్రిస్టియననీ
కులమతాలను వికటించేదాకా హింసించి
పరిహసించింతర్వాత
కుల పరిశుద్ధత ఎవడిక్కావాలి!
ఈ ఇసుక ధర కొందరికైనా 
బంగారంగా మారాలి...

ఆత్మగౌరవ లిట్మస్ పరీక్షలో
అనవసర ‘అత్యవసర పరిస్థితి’లో
మనస్సాక్షి ‘హస్త’గతమయింతర్వాత
న్యాయం ఎటు వేపుందో చూడాలి
వేలాది చిరుద్యోగుల కొంపల్లో
బియ్యం నిండుకుంటున్న ఆర్తనాదం 
రేపటికల్లా వినబడాలి
ధర్మ పోరాటానికి దైవబలం కావాలి
ఆరోపణలకు బ్యాలన్స్ షీట్ ఆసరా కావాలి
వట్టినే శబ్దాలు చేసేవాళ్ళు రుజువులైనా
సేకరించగలగాలి
దేన్నీ రుజువు చెయ్యలేనివాళ్ళు
దేనికీ సమాధానం చెప్పలేనివాళ్ళు
సాక్ష్యం లేకుండా
సాక్షికి సమాధి కట్టగలరా!

‘సాక్షి’గా నిల్చిన ఆనవాళ్ళేగానీ
సేవ చేసిన ఆనవాళ్ళేగానీ
దేశ సార్వభౌమత్వాన్ని ధిక్కరించిన దాఖలాలు
కనబడితే... అరెస్టు చేద్దురుగాని రండి...

-తుల్లిమల్లి (దొడ్డిగర్ల) విజయభారతి