Friday, 18 May 2012

ముస్లిం సోదరులతో జగన్ సమావేశం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు సొంత జిల్లాలో ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారు. రైల్వేకోడూరులో ఆయన శుక్రవారం ముస్లింలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు వైఎస్‌ జగన్‌కు టోపీ తొడిగి శాలువా కప్పారు. అనంతరం ఆయన అమ్మవారిశాల, గంగమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి ఓబులవారిపల్లె మండలంలో పర్యటనకు బయల్దేరారు.

10.30 గంటలకు ఆర్. రాచపల్లె, 11.45కు వై.కోట, 12.15కు సున్నపురాళ్లపల్లె, 12.45కు చెన్నరాజుపోడులో క్షత్రియులతో సమావేశం, మధ్యాహ్నం 1.30 గంటలకు మంగంపేటలో భోజనం, అనంతరం 2.30 కు కొర్లకుంట, 3.00 గంటలకు ముక్కవారిపల్లె, 4.00 గంటలకు ఓబులవారిపల్లె, సాయంత్రం 5.00 గంటలకు రైల్వేకోడూరు రోడ్‌షోలో వైఎస్ జగన్ పాల్గొంటారన్నారు.

భారతదేశ చరిత్రలో మీడియా అటాచ్‌మెంట్ ఇదే ప్రథమం .‘సాక్షి’ గొంతు నొక్కటానికి విడుదల చేస్తున్న జీవోలన్నీ అర్ధరాత్రే విడుదల

‘సాక్షి’ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
సునీల్‌రెడ్డి, కోనేరు ప్రసాద్ ఆస్తులు కూడా అటాచ్‌మెంట్ 
శుక్రవారం సాయంత్రం మూడు రహస్య జీవోలు విడుదల 
ఉత్తర్వుల తయారీ నుంచి సంతకాల దాకా అంతా గోప్యమే 
జీవోల్లోని సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు
హోంమంత్రి ఇంటికెళ్లి సంతకం పెట్టించిన ప్రిన్సిపల్ సెక్రటరీ 
అంతా స్వయంగా దగ్గరుండి చూసుకున్న ముఖ్యమంత్రి 
‘సాక్షి’కి సత్వర న్యాయం అందకూడదనే వారాంతంలో విడుదల 
జీవోల ఆధారంగా అటాచ్‌మెంట్‌కు కోర్టు అనుమతి కోరనున్న సీబీఐ 
సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులనుబట్టి తదుపరి చర్యలు 
కోర్టు అనుమతించినా ‘సాక్షి’ రోజువారీ కార్యకలాపాలు యథాతథం
ఆస్తుల క్రయవిక్రయాలు, బదలాయింపులు మాత్రమే నిషేధం 
భారతదేశ చరిత్రలో మీడియా అటాచ్‌మెంట్ ఇదే ప్రథమం 
{బిటిష్ పాలనలోనూ లేని నిర్ణయాలకు కిరణ్ సర్కారు ఓకే 
{పకటనల నుంచి అటాచ్‌మెంట్ వరకూ అన్నీ అర్ధరాత్రి చర్యలే

హైదరాబాద్, న్యూస్‌లైన్: కుట్రలు పదునెక్కుతున్నాయి. కుయుక్తులు తీవ్రమవుతున్నాయి. ‘సాక్షి’ గొంతులో కత్తులు దించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. స్వతంత్ర భారత చరిత్రలోనే కాదు.. బ్రిటిష్ వారి హయాంలో సైతం జరగని ఘోరాలకు రాష్ట్రం వేదికవుతోంది. అర్ధరాత్రి జీవోలు, చీకటి జీవోల పంచన రహస్య జీవోలూ వచ్చి చేరుతున్నాయి. నల్ల జీవోతో ‘సాక్షి’కి ప్రకటనలివ్వటాన్ని నిషేధించి ఆర్థికంగా దెబ్బకొట్టాలని చేసిన ప్రయత్నాన్ని హైకోర్టు అడ్డుకున్నా రాష్ట్ర ప్రభుత్వం తీరు మారలేదు. 24 గంటలు కూడా తిరక్కముందే మరో చీకటి జీవోను విడుదల చేసింది. ‘సాక్షి’ పత్రిక, టెలివిజన్ చానల్ ఆస్తుల్ని అటాచ్ చేసుకోవటానికి సీబీఐకి అనుమతినిస్తూ శుక్రవారం రహస్య జీవోను విడుదల చేసింది. అంతే రహస్యంగా ప్రత్యేక దూత ద్వారా దీన్ని సీబీఐకి అందజేసింది. సీబీఐ ఇప్పుడు ఈ జీవో ఆధారంగా జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థల ఆస్తుల్ని అటాచ్ చేసుకోవటానికి (తన కస్టడీలోకి తీసుకోవటానికి) అనుమతివ్వాలని కోర్టును కోరుతుంది. అనుమతి ఇవ్వటమా.. నిరాకరించటమా.. అన్నది కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కోర్టు గనక అనుమతిస్తే.. ఆ తరవాత సీబీఐ తాను పేర్కొన్న ఈ మూడు సంస్థల ఆస్తుల్ని తన కస్టడీలోకి తీసుకుంటుంది. అంటే అప్పటి నుంచి వీటిని విక్రయించటం కానీ, వేరొకరికి బదలాయించటం కానీ వీలుపడదన్న మాట. అయితే ఇవి ఉద్యోగులతో, రోజువారీ కార్యకలాపాలతో నడిచే సంస్థలు కాబట్టి ఆ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవన్నది న్యాయ నిపుణుల మాట. ‘‘అటాచ్‌మెంట్ అంటే.. ఆస్తుల బదిలీ, విక్రయాల నిషేధం మాత్రమే. సంస్థల రోజువారీ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు’’ అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. 

ఇప్పుడంత అవసరం ఉందా? 

నిజానికి ప్రభుత్వాధికారులు, పబ్లిక్ సర్వెంట్లు అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని విక్రయించేస్తారనో వేరొకరికి బదలాయిస్తారనో భయపడినప్పుడు.. ఒకరకమైన అత్యవసర పరిస్థితులు తలెత్తినపుడు మాత్రమే దర్యాప్తు సంస్థలు ఆ ఆస్తుల్ని అటాచ్ చేసుకోవటానికి (కస్టడీలోకి తీసుకోవటానికి) ప్రభుత్వం అనుమతిస్తూ ఉంటుంది. ‘సాక్షి’ విషయంలో అలాంటి పరిస్థితులేవీ లేవు. ‘సాక్షి’ ఆస్తుల్ని వేరొకరికి బదలాయిస్తారన్న భయాలూ లేవు. కానీ మీడియా గొంతు నొక్కాలనే ఏకైక ఉద్దేశంతో ఈ జీవోను జారీ చేశారన్నది సుస్పష్టం. ఎందుకంటే సీబీఐ కస్టడీకి ప్రభుత్వం అనుమతించిన మూడు సంస్థలూ మీడియాతో ముడిపడినవే. జగతి పబ్లికేషన్స్ సంస్థ ‘సాక్షి’ని ప్రచురించేది కాగా.. ఇందిరా టెలివిజన్ సంస్థ ‘సాక్షి’ చానల్‌ను నడుపుతోంది. ఇక ‘సాక్షి’ భవనాల యాజమాన్యం జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చేతిలోనే ఉంది. అందుకే ఈ మూడు సంస్థల్నీ టార్గెట్ చేశారన్నది ఇక్కడ సుస్పష్టం. దీంతో పాటు ఎమ్మార్ కేసులో అరెస్టయిన సునీల్‌రెడ్డి, కోనేరు ప్రసాద్‌ల ఆస్తుల్ని కూడా సీబీఐ అటాచ్ చేసుకోవటానికి ప్రభుత్వం సమ్మతించింది. ఈ మేరకు సీబీఐ ఎస్‌పీ సి.హెచ్.వెంకటేష్‌కు అనుమతిస్తూ జీవో నంబర్లు 87, 88, 89 లతో విడుదల చేసిన ఈ ఉత్తర్వుల్ని ప్రభుత్వం తన వెబ్‌సైట్లో పెట్టింది కానీ.. వాటిని ‘కాన్ఫిడెన్షియల్’ అన్న కేటగిరీలో ఉంచింది. అంటే రహస్య జీవోలన్న మాట. వాటిలోని వివరాలు బయటకు చెప్పరు.

అన్నీ చీకటి చర్యలే... 
ఎందుకో తెలియదు కానీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ ‘సాక్షి’ గొంతు నొక్కటానికి విడుదల చేస్తున్న జీవోలన్నీ అర్ధరాత్రే విడుదలవుతున్నాయి. ‘సాక్షి’ బ్యాంకు ఖాతాలను ఈ నెల 8న సీబీఐ స్తంభింపజేయగా.. ఆ మర్నాడు అర్ధరాత్రి ‘సాక్షి’కి ప్రభుత్వం తరఫున ప్రకటనలన్నిటినీ నిలిపివేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మరుసటి రోజు ఉదయానికి ఈ విషయం బయటపడింది. ఇపుడు ‘సాక్షి’ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించి త్వరలో జీవో రాబోతోందంటూ రెండు రోజులుగా రామోజీ పుత్రిక ‘ఈనాడు’, దాని తోకపత్రిక, తోక చానెల్ ఊదరగొట్టేస్తున్నాయి. మరో గంటలో జీవో.. మరికొద్ది నిమిషాల్లో జీవో అంటూ రెండ్రోజులుగా రాత్రీపగలూ ఇదే వార్తను ప్రసారం చేస్తున్నాయి. ఎట్టకేలకు శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ జీవోల నంబర్లను వెబ్‌సైట్లో పెట్టారు. జీవోల్లో ఏముందో మాత్రం తెలియనివ్వలేదు. ‘కాన్ఫిడెన్షియల్’ అని పెట్టేశారు. అసలు ఒక మీడియా సంస్థ ఆస్తుల్ని అటాచ్ చేసుకోవటానికి దర్యాప్తు సంస్థకు అనుమతివ్వటమనేది భారతదేశ చరిత్రలో ఇప్పటిదాకా ఎన్నడూ జరగలేదు. మామూలుగా ఏసీబీ అవినీతి కేసుల్లో పట్టుబడిన అధికారుల ఆస్తుల విషయంలో ఇలాంటి అనుమతులిస్తూ ఉంటారు. ఆ అనుమతులిస్తూ విడుదల చేసే జీవోలను ఎన్నడూ కాన్ఫిడెన్షియల్‌గా ఉంచరు. అంతా బహిరంగమే. కానీ ‘సాక్షి’ విషయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముందెన్నడూ లేని సంప్రదాయాలకు తెర తీశారు. అత్యంత రహస్యంగా.. మంత్రులకు సైతం తెలియకుండా అత్యంత గోప్యంగా వ్యవహరించారు. హైడ్రామా నడిపించారు. అదెలాగంటే...

హోంమంత్రి ఇంటికి ప్రిన్సిపల్ సెక్రటరీ...

‘సాక్షి’ ఆస్తుల అటాచ్‌మెంట్ విషయంలో ప్రభుత్వం అత్యంత గోప్యంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి కిరణ్‌తో హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయేంద్ర పాల్ గురువారం మధ్యాహ్నం, సాయంత్రం రెండు దఫాలుగా సమావేశమయ్యారు. అక్కడే ఈ జీవోలు ప్రాణం పోసుకున్నాయి. విషయం బయటకు పొక్కుతుందనే అనుమానంతో కిందిస్థాయి ఉద్యోగుల జోక్యం ఏమాత్రం లేకుండా పాల్ స్వయంగా ఈ జీవో బాధ్యతలు చూశారు. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో అజయేంద్ర నేరుగా హోంమంత్రి పి.సబితాఇంద్రారెడ్డి నివాసానికి ఫైలు తీసుకుని వెళ్లారు. అప్పటికే డ్రాఫ్ట్ జీవోను తయారుచేసి, ఆ ఫైలుపై హోంమంత్రి సంతకం తీసుకున్నారు. తరవాత దానిపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. కావాలంటే అదే రోజు రాత్రి జీవోలను విడుదల చేయొచ్చు. కానీ ప్రభుత్వం ఇక్కడ అత్యంత కుట్రపూరితంగా వ్యవహరించింది. గురువారం రాత్రి గనక జీవో వెలువడితే శుక్రవారం కోర్టులు పనిచేస్తాయి. ‘సాక్షి’ సంస్థలు న్యాయం కోసం తక్షణం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అందుకే శుక్రవారం సాయంత్రం కోర్టు సమయం పూర్తయ్యేవరకూ వేచి చూసి.. సాయంత్రం 7-8 గంటల మధ్యలో ఈ జీవోను విడుదల చేశారు. ప్రత్యేక దూత చేతికిచ్చి సీబీఐకి పంపించారు. శనివారం సీబీఐ దర్యాప్తు అధికారులు ఈ జీవోను కోర్టులో దాఖలు చేసి.. అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతారు. మర్నాడు ఆదివారం కనుక ‘సాక్షి’కి అప్పటికప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉండదు. ఇదీ... కిరణ్ కుట్ర. 

అధికారులంతా గప్‌చుప్... 

జీవోలు వెల్లడైనట్లు తెలిసినా.. అవి రహస్యం కేటగిరీలో ఉండటంతో వాటిలో ఏముందనేది వెల్లడించటానికి అధికారులు సైతం ఇష్టపడలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము వీటిపై మాట్లాడకూడదని కూడా కొందరు అధికారులు చెప్పారంటే పరిస్థితి తెలియకమానదు. నిజానికి సత్యం కంప్యూటర్స్ వ్యవహారం తీసుకున్నా.. కృషి బ్యాంక్ తదితర ఆర్ధిక నేరాలను చూసినా ఆయా కేసుల్లో సైతం అటాచ్‌మెంట్‌కు సంబంధించిన జీవోల పూర్తి వివరాలను వెబ్ సైట్లో పెట్టారు. కానీ.. సాక్షి మీడియా విషయంలో ప్రభుత్వం అత్యంత గోప్యంగా వ్యవహరించటం గమనార్హం. నిజానికి జీవోల వివరాలను బయటపెట్టకుండా జాగ్రత్త వహించిన ప్రభుత్వం వాటిని రామోజీ తోక పత్రికకు మాత్రం తెలియజేసింది. ఈ వార్తను లీక్ చేయటం ద్వారా సాక్షి ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయటమనేది ప్రభుత్వ ప్రణాళికగా కనిపిస్తున్నట్లు న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు.

‘సాక్షి’లో లగడపాటి తమ్ముడూ పెట్టుబడులు పెట్టారు.. ఆయన్ను అరెస్టు

సీబీఐ, కాంగ్రెస్, చంద్రబాబుకు సూటి ప్రశ్న
కాంగ్రెస్, చంద్రబాబు సీబీఐ దర్యాప్తునూ మేనేజ్ చేస్తున్నారు
సీబీఐ చార్జిషీటును కోర్టు ఇవ్వకముందే ‘ఈనాడు’ పతాక శీర్షికల్లో వస్తోంది
‘సాక్షి’ని మూసేయించాలని అందరూ కలిసి కుట్ర చేస్తున్నారు

కడప, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పెద్దలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసి కుమ్మకై అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. తనను రాజకీయంగా ఎదుర్కోవడం చేతకాక.. అణగదొక్కాలని చూస్తున్నారని, వీరిద్దరూ కలిసి చివరకు సీబీఐ దర్యాప్తును సైతం మేనేజ్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ‘ఈ రోజు కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9.. అందరూ ఒక్కటై సాక్షి పత్రిక, సాక్షి టీవీని మూసేయించాలని కుట్ర పన్నుతున్నారు. 

నేను ఒక్కటే అడుగుతున్నా.. ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టారని ప్రసాద్ గారిని(నిమ్మగడ్డ ప్రసాద్) తీసుకుపోయి జైల్లో పెట్టారు. ‘సాక్షి’లో ల్యాంకో గ్రూప్‌కు చెందిన లగడపాటి రాజగోపాల్ తమ్ముడు కూడా పెట్టుబడులు పెట్టారు. ఆయన్ను తీసుకుపోయి జైల్లో పెట్టే ధైర్యముందా మీకు అని నేను సీబీఐని, కాంగ్రెస్ పెద్దలను, చంద్రబాబును ప్రశ్నిస్తున్నా’ అని జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి కె.శ్రీనివాసులు తరఫున జగన్ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. మంగంపేట, రైల్వేకోడూరుతో పాటు పలు చోట్ల ప్రసంగించారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

కోర్టు ఇవ్వకముందే ‘ఈనాడు’లో...

బాధెక్కడ అనిపిస్తోందీ అంటే.. కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు కలిసి సీబీఐ దర్యాప్తును కూడా మేనేజ్ చేస్తున్నారు. సాధారణంగా.. సీబీఐ ఒక చార్జిషీటు ఫైల్ చేసి కోర్టుకు ఇస్తుంది. తర్వాత సంబంధిత వ్యక్తులకు ఆ చార్జిషీటు ఇవ్వాలని ఆ కోర్టు చెప్తుంది. కోర్టు దాన్ని ఇచ్చే వరకు అందులో ఏముందో ఎవ్వరికీ తెలియదు. ఆశ్చర్యం ఏమిటంటే.. కోర్టు ఇవ్వకముందే చార్జిషీటులో ఏముందో మొత్తం ‘ఈనాడు’ పేపర్ పతాక శీర్షికల్లో వచ్చేస్తోంది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అధికార, ప్రతిపక్షాలు కలిసి కుమ్మక్కయ్యాయి. కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు ఇద్దరూ కలిసి కోర్టులకు వెళతారు. వెళ్లి కలిసి కేసులు వేస్తారు. చనిపోయిన వైఎస్‌ను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకుని పోటీలు చేస్తారు. ఆర్‌టీఐ కమిషనర్ పదవులను చెరిసగం పంచుకునే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఆయనకు సన్నిహితుడైన జీఎన్ నాయుడు అనే వ్యక్తికి హైదరాబాద్ నడిబొడ్డున అమీర్‌పేటలో ఐదెకరాల భూమిని ధారాదత్తం చేశారంటే.. వీరి కుమ్మక్కు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి నాయకుడే లేడు..

వైఎస్ మన మధ్య నుంచి వెళ్లిపోయాక.. ప్రతి పేదవాడి ముఖాన చిరునవ్వు చూడాలని తపించే నాయకుడే కరువయ్యాడు. తాను చనిపోయాక కూడా ప్రతి పేదవాడి ఇంట్లో తన ఫొటో ఉండాలని, అంతగా ఆ పేదవాడికి మేలు చేయాలన్న తాపత్రయం ఏ నాయకుడిలోనూ కనిపించడం లేదు. 

రెండు మూడు నెలల కిందట నేను కడపకు వచ్చినప్పుడు టమాటా కిలో అర్ధరూపాయికే అమ్ముకుంటున్న రైతన్నను పరామర్శించా.. ఉల్లిపాయలు కిలో రూ.2కే అమ్ముకుంటున్న రైతన్ననూ కలిశా. క్వింటాలు పసుపు రూ.2,500 నుంచి రూ.3,000 మధ్య మాత్రమే పలుకుతున్న దయనీయ స్థితిలో ఉన్న పసుపు రైతుతోనూ మాట్లాడా. వైఎస్ మరణించాక ఏ రైతును కదిలించినా.. ‘ఈ పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం కంటే ఉరి వేసుకోవడం మేలనిపిస్తోందన్నా’ అని అంటుంటే చాలా బాధనిపిస్తోంది. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టదు. క్రాప్ హాలిడే ప్రకటించి లక్ష ఎకరాలు బీడుగా వదిలేసినా పట్టించుకునే నాథుడు లేడు. ఇక కూలి పనులు చేసుకునే అక్కచెల్లెమ్మల పరిస్థితి మరీ దయనీయం. కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ, శ్రీకాకుళం జిల్లాల నుంచి అక్కాచెల్లెమ్మలు పిల్లా పాపలతో కలిసి వలసపోయి పొలాల్లో పని చేసుకుంటున్నారు. 

జిల్లాలకు వెళ్లినప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. వారిని ఎందుకమ్మా ఇంత దూరం వచ్చారు.. మీకు ఉపాధి పనులు కూడా దొరకడం లేదా అని అడిగితే... ‘కనీస వేతనం రూ.137 ఇవ్వాలని ఓ వైపు ప్రభుత్వమే చెప్తోంది.. మరోవైపు అదే ప్రభుత్వం క్యూబిక్ మీటర్ చొప్పున కాంట్రాక్ట్ ఇస్తోంది.. దీంతో రూ.60 నుంచి రూ.70 కూడా మాకు రావడం లేదన్నా’ అని చెప్తుంటే చాలా బాధనిపించింది.

దున్నపోతు మీద వానలా.. సర్కారు వైఖరి: ప్రతి ఇంటి నుంచీ కనీసం ఒక్కరైనా ఇంజినీరో, డాక్టరో అవ్వాలని, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలని.. అప్పుడే ఆ ఇంటి నుంచి పేదరికం పోతుందన్న ఉద్దేశంతో వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ప్రవేశపెట్టారు. ఇవాళ చదువుకునే ఏ పిల్లాడిని అడిగినా.. ‘అన్నా నేను కాలేజీకైతే పోతున్నాను కానీ.. ఈ ప్రభుత్వం ఫీజు కడుతుందో కట్టదో అన్న భయంతోనే చదువుతున్నా. మీరు ఈ ఏడాది ఫీజు గురించి అడుగుతున్నారు... కానీ మాకు నిరుటి స్కాలర్‌షిప్పు డబ్బులే రాలేదన్నా’ అంటున్నాడు. విద్యార్థుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నాలు చేశాం.. దీక్షలు చేశాం.. అయినా దున్నపోతుమీద వర్షం కురిసినట్లుగా ప్రభుత్వ వైఖరి ఉంది. ఇక వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని చూస్తే.. దాన్ని ఓ పథకం ప్రకారం నాశనం చేస్తోందీ ప్రభుత్వం. రాష్ట్రంలో 18 స్థానాలకు జరుగుతున్నఉప ఎన్నికలు ఈ పాలకులకు గుణపాఠం నేర్పాలి. రాబోయే మహాసంగ్రామానికి నాంది పలకాలి. మనం వేసే ప్రతి ఓటు.. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో నిజాయతీకే పట్టం కట్టాలి.

సీఎం పీఠంపై మీ బిడ్డే కూర్చుంటాడు..

త్వరలో ఓ సువర్ణయుగం వస్తుంది. ఆరోజు మీ బిడ్డ సీఎం పీఠంపై కూర్చుంటాడు. అప్పుడు నేను మంగంపేటకు వ స్తా! రచ్చబండ నిర్వహిస్తా! ఎవరికైనా పింఛను రాలేదా? ఇల్లు లేదా? చదవాలనే కోరిక ఉండి ఎవరైనా ఆర్థిక స్తోమత అనుకూలించక చదవలేకపోతున్నారా? ఎవరికైనా ఆరోగ్యశ్రీ కార్డు లేదా? అని అడిగితే ఒక్క చేయి కూడా పైకి లేవని స్థాయిలో సువర్ణ పాలన అందిస్తా. అప్పుడే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మకు నిజమైన శాంతి. 
- మంగంపేటలో జగన్‌మోహన్‌రెడ్డి

తీవ్ర జ్వరం.. అయినా ఆగని రోడ్‌షో

మండుతున్న ఎండలనూ లెక్కచేయకుండా జనంతో మమేకమవుతూ రోడ్‌షోలు నిర్వహిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి శుక్రవారం తీవ్ర జ్వరం వచ్చింది. శుక్రవారం కూడా ఎండ వేడిమి తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ ఆయన ప్రచారం ఆపలేదు. యథావిధిగా రోడ్‌షో నిర్వహించారు. ప్రతీ పల్లెలో ప్రచార రథం దిగి వచ్చి మహిళలను ఆప్యాయంగా పలకరించి, చిన్న పిల్లలు, వృద్ధులకు ముద్దులు పెడుతూ అభిమానాన్ని పంచారు. 

జగన్ పట్టుదలను చూసి ప్రజలు నివ్వెరపోయారు. కాగా రెండు రోజులపాటు రైల్వే కోడూరు నియోజకవర్గంలో జగన్ నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అడుగడుగునా జగన్‌కు జనాభిమానం అడ్డుపడడంతో ఆయన కాన్వాయ్ ముందుకు కదలడమే కష్టమైంది. సమయాభావం వల్ల చాలా గ్రామాలకు జగన్ వెళ్లలేకపోయారు. శుక్రవారం పర్యటనను ముగించుకుని జగన్ నేరుగా రేణిగుంట చేరుకుని అక్కడి నుండి రైల్లో ఒంగోలు వెళ్లిపోయారు. అక్కడ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రైల్వే కోడూరు పర్యటనలో జగన్ వెంట.. మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్, డీసీసీ బ్యాంకు చైర్మన్ బ్రహ్మానందరెడ్డి తదితరులున్నారు.

నేడు ఒంగోలు నియోజకవర్గంలో జగన్ ప్రచారం

- కొత్తపట్నం మండలం నుంచి ప్రారంభం
- ఒంగోలు గాంధీనగర్‌లో ముగింపు 
ఒంగోలు కార్పొరేషన్, న్యూస్‌లైన్ : ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఒంగోలు రానున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆయన పర్యటన వివరాలను ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి జగ న్‌మోహన్‌రెడ్డి ఒంగోలు చేరుకొని లాయర్‌పేటలోని వైవీ భద్రారెడ్డి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు. శనివారం ఉదయం 9 గంటలకు ఒంగోలు నుంచి బయలు దేరి కొత్తపట్నం మండలం ఈతముక్కల, మడనూరు గ్రామాల్లో జరిగే ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. 

అనంతరం ఒంగోలు మండలం పరిధిలోని చెరువు కొమ్ముపాలెం, యరజర్ల, సర్వేరెడ్డిపాలెం, వెంగముక్కపాలెంలో పర్యటిస్తారు. ఆ తర్వాత ఒంగోలు నగరంలోని చర్చి సెంటర్‌లో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో జగన్ ప్రసంగిస్తారు. అక్కడ నుంచి పాత మార్కెట్ సెంటర్‌లో జరిగే రోడ్‌షోలో మాట్లాడతారు. తదనంతరం కర్నూలు రోడ్డులోని సెయింట్ జేవియర్స్ సమీపంలోని వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత గాంధీనగర్‌లోని వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. జగన్ పర్యటనను విజయవంతం చేయాలని నియోజకవర్గ ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు.

Thursday, 17 May 2012

కడపలో జగన్కి జన హోరు


కడప, న్యూస్‌లైన్: జన హోరుతో రైల్వేకోడూరు నియోజకవర్గం హోరెత్తింది. మహానేత తనయుడు వైఎస్ జగన్‌కు ప్రజలు నీరాజనం పట్టారు. ప్రజల అభిమానానికి పులకించిపోయిన జగన్.. ప్రతి అక్కా చెల్లి, అవ్వాతాతలను ఆత్మీయంగా పలకరించారు. తమ అభిమాన నేతను చూసేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా జనం ఎదురుచూశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం పెనగలూరు మండలం కొండూరులో మాజీ ఎమ్మెల్యే ప్రభావతమ్మ నివాసం నుంచి వైఎస్ జగన్ బయలుదేరారు. తిరుణం పల్లి, సిరివరం, ఎన్‌ఆర్ పురం మీదుగా పెనగలూరుకు చేరుకున్నారు.

అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి కంబాలకుంట, సింగనమల, ఓబిలి, బెస్తపల్లి మీదుగా చక్రం పేటకు చేరుకున్నారు. అనంతరం మూగవారిపల్లి, ఈటిమారిపురం, కట్టావారిపల్లి, పోళ్లోపల్లి, దేవమాచుపల్లి, గొల్లపల్లె మీదుగా చిట్వేలి చేరుకున్నారు. చిట్వేలికి చేరుకునే సరికి రాత్రి 9. 30 అయింది. మధ్యాహ్నం 3 గంటలకే చిట్వేలికి రావాల్సిన జగన్ ఆరుగంటలు ఆలస్యంగా రాత్రి పొద్దుపోయాక వచ్చినా జనాలు అలాగే నిరీక్షించారు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తర్వాత చిట్వేలిలోని అమ్మవారిశాలను సందర్శించారు. అక్కడి నుంచి నేరుగా మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్ ఇంటికి వెళ్లారు.

కొరుముట్లను గెలిపించండి:
ప్రచారంలో ప్రతి పల్లెవాసులను జగన్ తమకు అండగా నిలవాలని కోరారు. ప్రజలు, రైతన్నల కోసం అండగా నిలిచి, వారి కోసం పదవీ త్యాగం చేసిన తాజా మాజీ ఎమ్మెల్యే కొరుముట్లకు సెల్యూట్ చేశారు. కొరుముట్లపై అందరూ చల్లని ఆశీర్వాదాలు చూపి దీవించాలని, ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. చిట్వేలి వైఎస్సార్ సర్కిల్‌లో జరిగిన ప్రచారం అనంతరం మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్ జగన్ సమక్షంలో వైఎస్సార్ పార్టీలో చేరారు.

నేడు రైల్వేకోడూరులో రోడ్‌షో
కడప, న్యూస్‌లైన్ : వైఎస్ జగన్ శుక్రవారం రైల్వేకోడూరులో రోడ్‌షో నిర్వహించనున్నట్లు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వైఎస్ కొండారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు రైల్వేకోడూరులో ముస్లిం నాయకులతో జగన్ సమావేశమవుతారు. అనంతరం అమ్మవారిశాల, గంగమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత ఓబులవారిపల్లె మండలంలో పర్యటిస్తారని వైఎస్ కొండారెడ్ది తెలిపారు. 10.30 గంటలకు ఆర్. రాచపల్లె, 11.45కు వై.కోట, 12.15కు సున్నపురాళ్లపల్లె, 12.45కు చెన్నరాజుపోడులో క్షత్రియులతో సమావేశం, మధ్యాహ్నం 1.30 గంటలకు మంగంపేటలో భోజనం, అనంతరం 2.30 కు కొర్లకుంట, 3.00 గంటలకు ముక్కవారిపల్లె, 4.00 గంటలకు ఓబులవారిపల్లె, సాయంత్రం 5.00 గంటలకు రైల్వేకోడూరు రోడ్‌షోలో వైఎస్ జగన్ పాల్గొంటారన్నారు. 

సాక్షిని మూసేయించాలనే కుట్ర


కాంగ్రెస్, చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9పై వైఎస్ జగన్ ధ్వజం

రైల్వేకోడూరు(వైఎస్‌ఆర్ జిల్లా), న్యూస్‌లైన్: ‘ఈ రోజు కాంగ్రెస్ పెద్దలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9.. అందరూ కలిసి సాక్షి పత్రిక, సాక్షి టీవీని మూసేయించాలని కుట్ర పన్నుతున్నారు. ‘సాక్షి’ని మూసేయిస్తే మరో మాట జనానికి వినపడదు.. కనపడదు. అప్పుడు ఈనాడు రాసిందే రాత.. ఆంధ్రజ్యోతి రాసిందే గీత.. టీవీ9 చూపించిందే నిజమని జనాన్ని నమ్మించాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేయాలని చూస్తున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. అధికారపక్షం, ప్రతిపక్షం కలిసి రాష్ట్రంలో ప్రజల సమస్యలన్నీ గాలికి వదిలేశాయని, చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎలా అప్రతిష్టపాలు చేయాలన్న ఆలోచనతో మాత్రమే పనిచేస్తున్నాయని ఆయన నిప్పులు చెరిగారు. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి కె. శ్రీనివాసులు తరఫున జగన్ గురువారం ప్రచారం నిర్వహించారు. పెనగలూరు, చిట్వేలి మండలాల్లో ఆయన రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఆయన ప్రసంగించారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

మిర్చి పంటను తగులబెట్టుకుంటున్నారు..

వైఎస్ మన మధ్య నుంచి వెళ్లిపోయాక రాష్ట్రంలో రైతు పరిస్థితి అధ్వానంగా తయారైంది. మొన్న కర్నూలు జిల్లాలో ఉన్నప్పుడు పేపర్లో చదివా.. మిర్చి పంటకు గిట్టుబాటు ధర రాక.. రైతులు మిర్చిని తగులబెట్టుకుంటున్న పరిస్థితి చూసి చాలా బాధనిపించింది. వైఎస్‌ఆర్ జిల్లాలో రెండు నెలల క్రితం పర్యటించినపుడు రైతన్నలను పరామర్శించా... ఉల్లి ధర కేజీ రెండు రూపాయలు పలకడంతో చేలోనే వదిలేసిన పరిస్థితులు చూశా. ధరలేక టమాటాను నడిరోడ్డుపైనే రైతన్న పారవేసినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.

పభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నాలు చేశాం.. దీక్షలు చేశాం.. అయినా ప్రభుత్వ పనితీరు మారలేదు.. దున్నపోతుమీద వర్షం కురిసినట్లుగా ప్రభుత్వ వైఖరి ఉంది. ఈ రోజు వ్యవసాయం చేయడం కంటే ఉరి వేసుకోవడం మేలనే మాట ప్రతి రైతు నోటా వినపడుతోంది. ఇక కూలి పనులు చేసుకునే అక్కచెల్లెమ్మల పరిస్థితి మరీ దయనీయం. వాళ్లకు కనీస కూలీ కూడా ఇవ్వలేని పరిస్థితిలో రైతన్నలున్నారు. కనీస వేతనం రూ.137 ఇవ్వాలని ఓ వైపు ప్రభుత్వమే చెప్తోంది.. మరోవైపు అదే ప్రభుత్వం క్యూబిక్ మీటర్ చొప్పున కాంట్రాక్ట్ ఇచ్చి రూ.60 నుంచి రూ.70 కూడా కూలిగా ఇవ్వడం లేదు. దీంతో కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ, శ్రీకాకుళం జిల్లాల నుంచి అక్కాచెల్లెమ్మలు.. పిల్లా పాపలతో కలిసి గుంటూరు జిల్లాకు వలసపోయి పొలాల్లో పని చేస్తుంటే నేను ప్రత్యక్షంగా చూశాను. వారిని ఎందుకమ్మా ఇంత దూరం వచ్చారని అడిగితే... ‘వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయాక మా పరిస్థితి ఘోరంగా మారిందన్నా. క్యూబిక్ మీటరుకు ఇంత పని అని చేయించుకుంటున్నారు.. దీంతో 60-70 వరకు కూడా గిట్టడం లేదన్నా. ఆ డబ్బు కూడా రెండు, మూడు నెలల్లోపు వస్తే మా అదృష్టమన్నా’ అని చెప్తుంటే చాలా బాధనిపించింది.

ప్రభుత్వం ఫీజు కడుతుందో కట్టదో..

ప్రతి ఇంటి నుంచీ కనీసం ఒక్కరైనా ఇంజినీరో, డాక్టరో అవ్వాలని, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలని.. అప్పుడే ఆ ఇంటి నుంచి పేదరికం పోతుందని వైఎస్ ఓ స్వప్నాన్ని చూశారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ప్రవేశపెట్టారు. ఇవాళ చదువుకునే ఏ పిల్లాడిని అడిగినా.. ‘అన్నా నేను కాలేజీకైతే పోతున్నాను కానీ.. ఈ ప్రభుత్వం ఫీజు(ఫీజు రీయింబర్స్‌మెంట్) కడుతుందో కట్టదో అన్న భయంతోనే చదువుతున్నానన్నా’ అని అంటున్నాడు. నిరుటి స్కాలర్‌షిప్ డబ్బులే రాలేదంటున్నాడు. ఇక వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకాన్ని చూస్తే.. దాన్ని ఓ పథకం ప్రకారం నాశనం చేస్తోందీ ప్రభుత్వం.

108 వాహనాలు సగానికి సగం మూలనపడ్డాయి. ఫోన్ చేస్తే సిబ్బంది సమ్మెలో ఉన్నారనో.. వాహనాలు రిపేరు షెడ్లలో ఉన్నాయనో.. మాకు జీతాలు రావట్లేదనో చెప్తున్నారు. మూగ, చెవుడు ఉన్న పిల్లలకు సంజీవని లాంటి కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్‌ను వైఎస్ హయాంలో 12 ఏళ్ల వయసు వరకు ఉచితంగా చేయిస్తే ప్రస్తుత ప్రభుత్వం దాన్ని రెండేళ్లలోపు పిల్లలకు మాత్రమే వర్తింపజేస్తోంది. రెండేళ్లలోపు తమ పిల్లలకు చెవుడు, మూగ ఉన్నట్లు తల్లిదండ్రులు గుర్తించకపోతే ఆ చిన్నారులు జీవితాంతం దుర్భర జీవితం గడపాల్సిందేనా? వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రంలో పేదల కోసం కొత్తగా ఒక్క ఇల్లు కూడా కట్టించలేదీ ప్రభుత్వం.

ఇద్దరూ కుమ్మక్కై జనాన్ని గాలికొదిలేశారు..

అధికారపక్షం పట్టించుకోవట్లేదు.. పోనీ ప్రతిపక్షమైనా మన తరఫున పోరాటం చేస్తుందని ప్రజలు అటువైపు చూస్తే చంద్రబాబు దేశ చరిత్రలో ముందెన్నడూ లేని రీతిలో కాంగ్రెస్‌తో కుమ్మక్కైపోయారు. కుమ్మక్కై ప్రజల్ని గాలికొదిలేసి.. వైఎస్‌ను అప్రదిష్టపాలు చేయాలని చూస్తున్నారు. ఇద్దరూ కలిసి కోర్టుకు వెళతారు... వైఎస్‌ను అప్రదిష్టపాలు చేసేందుకు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకుని పోటీలు చేస్తున్నారు. ఆర్‌టీఐ కమిషనర్ పదవులను చెరిసగం పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఆయనకు సన్నిహితుడైన జీఎన్ నాయుడు అనే వ్యక్తికి హైదరాబాద్ నడిబొడ్డున అమీర్‌పేటలో ఐదెకరాల భూమిని ధారాదత్తం చేశారు. 18 స్థానాలకు జరుగుతున్నఉప ఎన్నికలు ఈ పాలకులకు గుణపాఠం నేర్పి రాబోయే మహాసంగ్రామానికి నాంది పలకబోతున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్

రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే గుంటి వెంకటేశ్వర ప్రసాద్ కాంగ్రెస్ పార్టీని వీడి గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధినేత జగన్ సమక్షంలో వందలాది మంది కార్యకర్తలతో ఆయన చేరారు. ఆయన రైల్వేకోడూరు నియోజకవర్గానికి 2004 నుంచి 2009 వరకు ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ వైఎస్‌పైనున్న అభిమానంతోనే పార్టీలో చేరానన్నారు. ఆయన పథకాలు తిరిగి అమలు కావాలంటే ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎం కావాల్సిందేనని ఆకాంక్షించారు. ఈయనతోపాటు పోలోపల్లె, టీడీపీ మాజీ సర్పంచ్ హరినారాయణరాజు పార్టీలో చేరారు. అలాగే వైఎస్ జగన్ సమక్షంలో తిరుపతికి చెందిన టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ తిరుపతి అభ్యర్థి కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా జగన్ రోడ్‌షోలో నియోజకవర్గ సమన్వయ కర్తలు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, రూపానందరెడ్డి, వైఎస్ కొండారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బ్రహ్మనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ దాడులకు మీరే ‘సాక్షి’

చార్జిషీట్ నంబర్ 1

రూ.19 కోట్ల లబ్ధికి 30 కోట్ల పెట్టుబడా?: తొలి చార్జిషీట్లో సీబీఐ చెప్పిన అంశం ఒక్కటే. ఫార్మా సంస్థలైన హెటెరో, అరబిందోలకు వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని పోలేపల్లి సెజ్‌లో భూములు కేటాయించారని, ఈ భూమి ఎకరా రూ.15 లక్షల విలువ చేస్తుందని అధికారులు చెప్పినా సరే ఎకరా రూ.7 లక్షలకే కేటాయించారని సీబీఐ పేర్కొంది. మొత్తంగా ఈ రెండు సంస్థలకూ భూములు కేటాయించటం వల్ల ప్రభుత్వానికి రూ.19 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొంది. దీనికి గాను ఆ సంస్థలు జగన్‌మోహన్ రెడ్డికి చెందిన కంపెనీల్లో రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టారని పేర్కొంది. 

అసలు 19 కోట్లు లబ్ధి పొందినందుకు 30 కోట్లు పెట్టుబడి పెట్టే వారెవరైనా ఉంటారా? 
అలా పెట్టారంటే దానర్థం వారు ఆ కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నారని భావించాల్సిన పని లేదా? 
వెనకబడిన జిల్లాలో పరిశ్రమలు రావాలంటే భూమిని తక్కువ ధరకు ఇవ్వాల్సిన అవసరం లేదా?
వందల ఎకరాలు కేటాయించేటపుడు ఎకరానికి విడిగా ఎంత రేటుందో అంతే చూస్తారా?
అభివృద్ధి చెందిన భూమి ఎకరా రూ.15 లక్షలున్నపుడు ఖాళీ భూమిని తక్కువకు కేటాయించరా?
తీసుకున్న సంస్థ రోడ్లు సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, చుట్టూ గోడ కట్టినపుడు ఆ రేట్లు పెరగవా?

చార్జిషీట్ నంబర్ 2

ఇన్వెస్టర్లు మోసపోయారా?: తొలి చార్జిషీట్లో క్విడ్ ప్రో కో వాదన చేసిన సీబీఐ... రెండో చార్జిషీట్లో మాత్రం మరో కొత్త వాదన తీసుకొచ్చింది. డెలాయిట్ సంస్థ జగతి పబ్లికేషన్స్‌కు విలువ కట్టిందని, రూ.3,500 కోట్ల నుంచి రూ.4,000 కోట్లుగా సంస్థను విలువ కట్టాలని విజయసాయిరెడ్డి కోరినందువల్లే ఆ సంస్థ అంత విలువను నిర్ణయించిందని పేర్కొంది. ఈ నివేదికను చూపించి ఇన్వెస్టర్ల ద్వారా పెట్టుబడులు పెట్టించారని, ఒకరకంగా ఇన్వెస్టర్లను మోసం చేశారని పేర్కొంది. ఇన్వెస్టర్లకు లాభాలు ఎలా వస్తాయో చెప్పలేదని, లాభాలతో కంపెనీ నుంచి బయటపడే మార్గాన్ని చూపించలేదని చెప్పింది. మొత్తమ్మీద ఈ చార్జిషీటంతా డెలాయిట్ నివేదిక ఆధారంగా పెట్టుబడులు పెట్టించటం... అనే అంశం చుట్టూ తిరిగింది. 

ఇక్కడ కీలకమైన ప్రశ్నలెన్నో ఉన్నాయి. అసలు సీబీఐ విచారించాల్సింది క్విడ్ ప్రో కో పెట్టుబడుల్నా లేక పెట్టుబడిదారులు మోసపోయారనే అంశాన్నా? 

అసలు జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం వల్ల తాము మోసపోయామని ఇన్వెస్టర్లెవరైనా ఫిర్యాదు చేశారా?

డెలాయిట్ నివేదికలో... ‘ఈ నివేదిక సదరు యజమానులిచ్చిన సమాచారం ఆధారంగానే తయారు చేశాం. భౌతికంగా ఆస్తుల్ని తనిఖీ చేయలేదు’ అనే గమనిక ఉందిగా!! మరి దీని ఆధారంగా పెట్టుబడులు పెట్టడమంటే గమనికను చూడనట్లా? 

షేర్ మార్కెట్లో షేర్లు కొన్నవారు నష్టపోతే సీబీఐ జవాబుదారీ వ్యవహరిస్తుందా? అసలు ఇన్వెస్ట్‌మెంట్ అంటేనే లాభం, నష్టం రెండూ ఉంటాయన్న సంగతి సీబీఐకి తెలియదా? 

ఇన్వెస్టర్లకు వచ్చే నష్టాల్ని విచారించటానికా సీబీఐ ఈ దర్యాప్తును చేస్తున్నది? 

‘సాక్షి’ షేరును రూ.350 చొప్పున అధిక విలువకు విక్రయించారని చెబుతున్న సీబీఐకి... ‘ఈనాడు’ తన ఒక్కో షేరును రూ.5,28,630 చొప్పున విక్రయించటం అక్రమమనిపించలేదా?

‘ఈనాడు’ తన విలువను రూ.9,000 కోట్లుగా అంచనా కట్టినపుడు సాక్షి విలువ అందులో సగం కూడా చెయ్యదా?

చార్జిషీట్ నంబర్ 3

రాంకీ చుట్టూ: విశాఖపట్నంలో ఫార్మా సిటీని ఏర్పాటు చేయటానికి రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు అనుమతులివ్వటమే కాక అక్కడ గ్రీన్‌బెల్ట్ కోసం వదలాల్సిన స్థలాన్ని తగ్గించటం ద్వారా సంస్థకు 150 ఎకరాలు మిగిలేలా చేశారని, అందుకే అది జగన్‌మోహన్ రెడ్డి కంపెనీల్లో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిందని ఈ చార్జిషీట్లో పేర్కొన్నారు. ఈ ఫార్మా సిటీకి సంబంధించిన వివరాలు చూస్తే... విశాఖలో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొంటూ 2000వ సంవత్సరం జూలై 18న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జీవో ఎంఎస్ నంబరు 381ని విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం ఒక ఫార్మా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ టాస్క్‌ఫోర్స్‌కు ఆయనే చైర్మన్. ఈ టాస్క్‌ఫోర్స్ ఫార్మా సిటీ కోసం భూముల్ని వెతికింది. 

కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న కోస్తా ప్రాంతం మొత్తాన్ని పరిశీలించింది. చివరకు పరవాడలోని ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియాను (ఐడీఏ) ఫార్మాసిటీకి అనువైన ప్రాంతంగా ఎంపిక చేసింది. నిజానికి పరవాడ ఐడీఏను 1997లో పారిశ్రామిక వాడగా ప్రకటించారు. కానీ అప్పట్లో జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా జరిపిన సర్వేలో ఇక్కడ పారిశ్రామికవాడ ఏర్పాటు సరికాదని బయటపడింది. దీంతో పరవాడ ప్రాంతాన్ని తక్కువ జల, వాయు కాలుష్యాలు వెదజల్లే కలాపాలకే పరిమితం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వీటిని బేఖాతరు చేస్తూ... ప్రభుత్వ- ప్రయివేటు భాగస్వామ్యంలో ఫార్మా లేదా కెమికల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 2001 సెప్టెంబరు 24న జీవో ఎంఎస్ నంబరు 501ని విడుదల చేసింది. 

2002లోనే ఏపీఐఐసీ ఆమోదం: ప్రభుత్వం జీవో వెలువరించిన వెంటనే ఏపీఐఐసీ కూడా సూత్రప్రాయంగా అక్కడ భూములు సేకరించి డెవలపర్‌కు అందజేసేందుకు సమ్మతించింది. ఈ మేరకు తన సమ్మతిని తెలియజేస్తూ 2002 సెప్టెంబరు 3న లేఖ రాసింది. డెవలపర్‌గా ఎల్ అండ్ టీని ఎంపిక చేశారు. అయితే ఫార్మా సెజ్‌ల అభివృద్ధిలో ఎల్ అండ్ టీకి ఏమాత్రం అనుభవం లేదని, దాన్ని ఎంపిక చేయటం సరికాదని విమర్శలు వచ్చాయి. దీంతో రాంకీ సంస్థను చంద్రబాబు ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనికి 2002లో 2,143 ఎకరాల భూములు అప్పగించింది. ఆ తరవాత 2004 ఏప్రిల్‌లో (వైఎస్ అధికారంలోకి రావటానికి నెల ముందు) రాంకీ-ఏపీఐఐసీ జాయింట్ వెంచర్ కంపెనీ హడావుడిగా ఏర్పాటయింది. 

ఇదీ జరిగిన కథ. 2,143 ఎకరాల్ని అప్పగించిన చంద్రబాబు నాయుడిని సీబీఐ ఎందుకు పట్టించుకోవటం లేదు? 
గ్రీన్‌బెల్డ్‌కు వైఎస్సార్ ప్రభుత్వం మినహాయింపులిచ్చిందంటూ జగన్ మోహన్‌రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తోంది? 
150 ఎకరాలు లబ్ధి చేకూర్చినందుకే వారు జగన్ కంపెనీల్లో 10 కోట్లు పెట్టుబడి పెట్టి ఉంటే 2,143 ఎకరాలు కేటాయించిన చంద్రబాబుకు ఏ మేర ప్రయోజనం చేకూర్చి ఉండాలి? ఆయన సంస్థల్లో ఎంత పెట్టుబడి పెట్టి ఉండాలి? 

మరి ఈ ముడుపులెలా వెళ్లాయి? 

దీన్నిబట్టి ఆ సంస్థ మున్ముందు లాభం వస్తుందనే ఉద్దేశంతో, కొత్త మీడియా సంస్థకు సహకరించాలనే ఉద్దేశంతో పెట్టుబడి పెట్టిందని అర్థం కావటం లేదా? 

‘సాక్షి’లోకి వచ్చిన ప్రతి పెట్టుబడికీ ఈ రకమైన లింకుల్ని వెదకటమే సీబీఐ పనిగా పెట్టుకుందని అర్థం చేసుకోనక్కర్లేదా?