[YSR ] నేడు, రేపు తంబళ్లపల్లె-నిర్మల్‌లలో విజయమ్మ పర్యటన
వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆది, సోమవారాల్లో
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లలో
పర్యటించనున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో ఆమె
పాల్గొంటారని పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ తెలిపారు.
టీడీపీ నుంచి వైదొలగిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే ఎ.వి.ప్రవీణ్‌కుమార్ రెడ్డి..
వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్న సందర్భంగా ఆదివారం బి.కొత్తకోట మండల
కేంద్రంలో ఏర్పాటు చేసే బహిరంగ సభ కు విజయమ్మ హాజరవుతారని అన్నారు. విజయమ్మ
ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి బెంగళూరు చేరుకుని
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బి.కొత్తకోట మండల కేంద్రానికి వెళతారు. అక్కడ
జిల్లా పరిషత్ హైస్కూలు మైదానంలో మధ్యాహ్నం 1.30కి జరిగే సభలో
పాల్గొంటారు. అనంతరం మళ్లీ ఆమె రోడ్డు మార్గంలో బెంగళూరు చేరుకుని అక్కడి
నుంచి విమానంలో అదే రోజు రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. సోమవారం ఉదయం
హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నానికి నిర్మల్ చేరుకుంటారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి భారీ
ఎత్తున తన అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న
సందర్భంగా మధ్యాహ్నం 1.30 గంటలకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె
పాల్గొంటారు. ఇంద్రకరణ్ సభ ముగిసిన తరువాత అదే రోజు అక్కడి నుంచి బయలుదేరి
రాత్రికి హైదరాబాద్‌కు చేరుకుంటారని రఘురామ్ వివరించారు.