తన మాట వినని వారిపైకి సీబీఐని ఉసిగొల్పడంలో కాంగ్రెస్ ప్రదర్శించే ‘చాతుర్యం’ బహిరంగ రహస్యం. సీబీఐ పేరుతో అసమ్మతి నేతలను అదిమి పట్టడంలో హస్తం పార్టీ ఆరితేరిపోయిందన్న ఆరోపణలు కోకొల్లలు. వ్యతిరేక గళం వినిపించే నాయకుల నోళ్లు నొక్కేందుకు, మాట వినని వారిని తన దారిలోకి తెచ్చేందుకు సీబీఐవైపే కాంగ్రెస్ చూస్తుందన్న విమర్శల వెల్లువకు అంతేలేదు. దర్యాప్తులో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’- అధికార పార్టీల సేవలో తరిస్తుండడం సంప్రదాయంగా వస్తోంది. ద్వంద్వ ప్రమాణాలతో ప్రధాన దర్యాప్తు సంస్థ ప్రతిష్ట క్రమక్రమంగా మసకబారుతోంది. కాంగ్రెస్ పార్టీ సొంత ప్రయోజనాల కోసం సీబీఐని సోపానం వాడుకుంటుందోనని గళమెత్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీన్ని బట్టే అర్థమవుతోంది సీబీఐని కాంగ్రెస్ ఎంత ‘సమర్థవంతం’గా వాడుకుంటుందో? టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నోసార్లు ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అంటూ సీబీఐని నిర్వచించారు. ఆయనే కాదు చాలా మంది నేతలు ఇదే రకమైన అభిప్రాయాన్ని అనేక సందర్భాల్లో వ్యక్తపరిచారు. ఎవరేమన్నా పట్టించుకోకుండా... ‘నవ్విపోదురు నాకేటి సిగ్గు’ చందంగా సీబీఐతో కాంగ్రెస్ తన అనుబంధాన్ని కొనసాగిస్తోంది. తన రాజకీయ అవసరాల కోసం ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థను దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు పోరుపెడుతున్నా చెవికెక్కించుకోకుండా చెలరేగిపోతోంది. యూపీఏ సంకీర్ణ సర్కారును కాపాడుకునేందుకు మాయావతి, ములాయం సింగ్ యాదవ్ లాంటి నాయకులను సీబీఐ కేసుల పేరుతో కాంగ్రెస్ తన దారికి తెచ్చిందన్న ఆరోపణలు చాలా కాలంగా వినబడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ తమ ‘ఆయుధం’కు పదును పెడతామని వీరప్ప మొయిలీ చెప్పడంతో కాంగ్రెస్ వైఖరి తేటతెల్లమయింది. పజలు గమనిస్తున్నారన్న జంకు కూడా కాంగెస్‌కుఉన్నట్టు కనబడడం లేదు. అధికారంతో ఏమైనా చేయొచ్చని వీర్రవీగుతోంది. తమకు ‘పవర్’ ప్రసాదించిన ప్రజలను పట్టించుకోకుండా, అధికారాన్ని కాపాడుకునేందుకు పాకులాడుతున్న ‘పురాతన పార్టీ’ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నది యధార్థం. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పే తిరుగులేని ఆయుధం. దీని ముందు ఏ అస్త్రమైనా దిగదుడుపే. |